ఆంధ్రప్రదేశ్
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. సిర్పూర్ నాగమ్మ చెరువులోకి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే హరీష్ బాబు!
05-11-2026 12:16
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్‌లోని నాగమ్మ చెరువు ఆయకట్టు రైతులకు పుష్కర కాలం నాటి కల నెరవేరింది.
xPress24, Mancherial, November 5,
12 సంవత్సరాల తర్వాత చెక్ డ్యాం నుండి కాల్వ ద్వారా నాగమ్మ చెరువులోకి నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరువులోకి వస్తున్న జలాలకు ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించి చీరె సారె సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సర్పంచ్ ప్రత్యేక చొరవతోనే ఈ బృహత్తర కార్యం పూర్తయిందని కొనియాడారు. నాగమ్మ చెరువులోకి నీరు చేరడం వల్ల క్రింది భాగంలో ఉన్న 3 నుండి 4 వేల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంతో పాటు యాసంగి పంటలకు కూడా సమృద్ధిగా సాగునీరు అందుతుందని తెలిపారు. పర్యాటక శాఖ నిధులతో నాగమ్మ చెరువు సుందరీకరణ పనులు చేపడతామని, కొత్త రైల్వే లైన్ మరియు స్థానిక ఉపాధి అవకాశాల పెరుగుదలకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.