తెలంగాణ
22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
12-11-2026 15:52
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 22-ఎ భూ సమస్యల దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, రిజిస్ట్రార్లతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి వారం జిల్లా స్థాయిలో సమీక్ష జరపాలని, యూఎల్‌సీ కోర్టు తీర్పులపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. నిజమైన భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సత్వర న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, November 12,
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీల మేరకు జీవో 118, జీవో 76 మెమోలు, అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, యూఎల్‌సీ దరఖాస్తులు, నాలా ప్రక్రియ, జీవో 59 అమలుపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదని ఆదేశించారు.
ప్రతి వారం జిల్లా స్థాయి సమీక్ష.. వారం రోజుల్లో యూఎల్‌సీ నివేదిక
ప్రభుత్వ జీవోలు కేవలం ఉత్తర్వులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రతి వారం కలెక్టర్లు, రిజిస్ట్రార్లు సమావేశమై దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని అంశాలను రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి పంపాలన్నారు. యూఎల్‌సీ కోర్టు తీర్పులు, ఎస్‌ఎల్‌పీల దాఖలుపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన యజమానులకు న్యాయం చేయాలని, అదే సమయంలో ప్రభుత్వ భూముల రక్షణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.