తెలంగాణ
అక్వాన్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
19-11-2026 09:52

తెలంగాణపై అక్వాన్ తుఫాన్ ప్రభావం పెద్దగా ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రమే తూర్పు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
xPress24, Hyderabad, November 19,
అక్వాన్ తుపాన్ ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాన్ ప్రభావంతో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
తీవ్ర తుపాను ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు దిశలో 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణా ఆగ్నేయంగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నంలోగా మచిలీపట్నం - పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తుపాను తీరం దాటే సమయంలో తూర్పు తెలంగాణ జిల్లాలపై ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను ముగిసిన తర్వాత పెద్దగా వర్షాలకు అవకాశం లేదని, ఎల్ నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.