ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: కలెక్టర్ రాజాబాబు
19-11-2026 09:38
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు భరోసా ఇచ్చారు.
xPress24, Ongole, November 18,
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు భరోసా ఇచ్చారు. బుధవారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య మత్స్యకారులు వలలను భద్రపరిచిన రెండు భవనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వలలు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. సమాచారం అందిన వెంటనే తెల్లవారుజామున 2 గంటలకల్లా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. ఒంగోలు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని వివరించారు.
వలలు కోల్పోయి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా 25 కిలోల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. విపత్తు నిబంధనల ప్రకారం వలలు పూర్తిగా కాలిపోయిన వారికి తక్షణ ఆర్థిక సాయంగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు.
నష్టపోయిన వలల వివరాలను సేకరించి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40 శాతం సబ్సిడీ వర్తింపజేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న భవనాలను కూడా తక్షణమే పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.