తెలంగాణ
అగ్నివీరుల వివాహానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
23-11-2026 10:23

అగ్నిపథ్ పథకం కింద దేశసేవలో నిమగ్నమైన అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.అదనపు రెండేళ్ల సర్వీసు పొడిగింపును ఎంచుకునే అగ్నివీరులు వివాహం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.రెండోదశ సర్వీసులో చేరి సుమారు నాలుగు వారాల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసిన వారికి మాత్రమే వివాహ అనుమతి వర్తిస్తుంది. నాలుగేళ్ల పదవీకాలం ముగిసే 75 శాతం మంది అగ్నివీరులకు మరో రెండేళ్ల పాటు సేవలందించే అవకాశం కల్పిస్తూ ఇటీవల కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
xPress24, Hyderabad, November 22,
రెండేళ్ల సర్వీసు పొడిగింపును ఎంచుకునే అగ్నివీరులు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022లో ప్రారంభమైన అగ్నిపథ్ నిబంధనల ప్రకారం తొలి నాలుగేళ్ల సర్వీసు కాలంలో అగ్నివీరులు వివాహం చేసుకోవడానికి వీల్లేదు. తాజా నిర్ణయం మేరకు రెండోదశ సర్వీసులో చేరి సుమారు నాలుగు వారాల పాటు సాగే ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్న వారికే వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. అగ్నిపథ్ పథకం ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివాహ నిషేధం ఎత్తివేత యువ సైనికుల వ్యక్తిగత, సామాజిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.
రెండేళ్ల పాటు పొడిగింపు
అగ్నివీరుల సేవా కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రకటించింది. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కింద నాలుగేళ్ల ప్రాథమిక పదవీకాలం పూర్తయిన తర్వాత బయటకు వెళ్లాల్సిన 75 శాతం మంది అగ్నివీరులకు అదనంగా మరో రెండేళ్ల పాటు సేవలు అందించే అవకాశాన్ని కల్పించింది. ఈ అదనపు రెండేళ్ల పొడిగింపు గడువు ముగిసిన తర్వాత ఆసక్తి గల అగ్నివీరులు సాయుధ దళాల్లో చేరవచ్చని తెలిపింది.
రక్షణ దళాల్లోకి 25శాతం మంది..
వాస్తవానికి తొలుత ప్రతిభ ఆధారంగా 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రక్షణ దళాల్లోని రెగ్యులర్ ఫోర్సెస్‌లో చేర్చుకుని, మిగిలిన 75 శాతం మందిని క్రమశిక్షణ కలిగిన యువకులుగా తిరిగి సమాజంలోకి పంపేలా పథకాన్ని రూపొందించారు. కానీ, అగ్నిపథ్ నిబంధనలను సవరించిన కేంద్రం, ఆ 75 శాతం మంది అగ్నివీరులకు అదనంగా మరో రెండేళ్ల పాటు సైన్యంలో సేవలందించే అవకాశం కల్పించింది. ఆ రెండేళ్ల గడువు పూర్తైన తర్వాత ఆసక్తి ఉన్న వారందరినీ నిర్దిష్ట ఎంపిక ప్రమాణాలకు లోబడి సాయుధ దళాల్లోకి తీసుకోనున్నారు.
అగ్నివీరుల పనితీరుపై పర్యవేక్షణ
2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లోనే అగ్నివీరుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, అవసరానికి తగ్గట్టుగా పథకాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి బ్యాచ్ అగ్నివీరుల నాలుగేళ్ల పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న వేళ, సర్వీసులో వారి పనితీరుపై సానుకూలంగా స్పందిస్తూ కేంద్రం ఈ కీలక మార్పులు చేసింది.