జాతీయం
అధునిక ఆయుధాలపైనే ఆధారపడొద్దు : సీడీఎస్ రాజా సుబ్రమణి
16-11-2026 12:27

ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తాజాగా నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0లో సీడీఎస్ రాజా సుబ్రమణి యుద్ధ తంత్రం, భవిష్యత్ యుద్ధ వ్యూహాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
xPress24, Hyderabad, November 16,
ఆధునిక యుద్ధ తంత్రంలో అత్యాధునిక ఆయుధాలపైనే ఆధారపడొద్దని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి స్పష్టం చేశారు. ఇప్పటికే త్రివిధ దళాల్లో డ్రోన్లను విస్తృతంగా అనుసంధానించామని, సైన్యంలో మల్టిపుల్ రాకెట్ లాంచర్ల పరిధిని మరింత పెంచుతున్నామని తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి పరిధిని విస్తరించడంతో పాటు, సాంప్రదాయ యుద్ధ అవసరాల కోసం కూడా స్వదేశీ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. వాటితో పాటు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయగల ఆయుధాలను సమకూర్చుకోవాలని తెలిపారు. ఈ ఆయుధాల తయారీ కోసం దేశీయ పరిశ్రమలకు స్పష్టమైన సాంకేతిక ప్రణాళికను అందించామని, త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు అనుగుణంగా శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0 లో ఆయన ప్రసంగించారు.
అలాగే జాతీయ భద్రతకు సంబంధించి ఆత్మనిర్భరత అంటే వ్యూహాత్మక నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే సామర్థ్యం, కీలక సాంకేతిక పరిజ్ఞానాలపై నియంత్రణ కలిగి ఉండటం, పటిష్టమైన సరఫరా వ్యవస్థలను కొనసాగించడమని సీడీఎస్ స్పష్టం చేశారు. అయితే, స్వావలంబన అంటే ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకుని ఏకాకిగా ఉండటం లేదా ప్రతి వస్తువును దేశీయంగానే ఉత్పత్తి చేయడం కాదని ఆయన పేర్కొన్నారు.