ఆంధ్రప్రదేశ్
అల్లూరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
21-10-2026 16:26

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిషత్ ఎన్నికల సమరం ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. దీంతో జిల్లావ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది.
xPress24, Paderu, October 21,
పాడేరు, అక్టోబర్ 21:
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిషత్ ఎన్నికల సమరం ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. దీంతో జిల్లావ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 11 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి సంబంధిత ఆర్డీవో కార్యాలయాలు లేదా పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.
నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
మొదటి రోజే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయా పార్టీల్లో టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటీ నెలకొంది.
జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక స్టాటిక్ సర్వైలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.