తెలంగాణ
అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
12-11-2026 16:24

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026ను మూడు విడతల్లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతోందని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు.
xPress24, Paderu, November 12,
పాడేరు, నవంబర్ 12:
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026ను మూడు విడతల్లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతోందని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు.
గురువారం పాడేరు కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ఎన్నికల షెడ్యూల్, మండలాల వారీగా ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) ప్రకటించిన షెడ్యూల్, మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో ఎన్నికల గణాంకాలు
జిల్లాలో మొత్తం 244 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 239 షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు, ఐదు నాన్ షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మొత్తం 244 సర్పంచ్ స్థానాలు, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.