తెలంగాణ
ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
12-11-2026 16:56
ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. రూ. 154 కోట్ల కేంద్ర నిధులతో చేపడుతున్న ఈ వంతెనలను వచ్చే జనవరి నాటికి పూర్తి చేసి రాకపోకలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
xPress24, Adilabad, November 12,
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులను ఆదేశించారు. రైల్వే, పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణంలో జాప్యం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు, వాహనదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పనుల ఆలస్యానికి గల కారణాలను కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. వెంటనే రైల్వే ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. భూసేకరణ సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపాన్ని అధిగమించి రాబోయే రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రూ. 154 కోట్ల కేంద్ర నిధులతో నిర్మాణం.. జనవరిలో అందుబాటులోకి
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే రూ. 154 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేశామని, వచ్చే జనవరి నాటికి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి దృష్ట్యా స్థానికులు ప్రస్తుత అసౌకర్యాన్ని సహించి పనులకు సహకరించాలని కోరారు.
బైట్స్
పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్