ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ దిశగా దూసుకొస్తున్న 'అక్వాన్' తుపాను.. శుక్రవారం కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం
18-11-2026 10:07
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అక్వాన్' తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ-విశాఖ మధ్య కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
xPress24, kakinada, November 18,
దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అక్వాన్' తుపాను ఉత్తర వాయవ్య దిశగా రాష్ట్రం వైపు కదులుతోంది. బుధవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడనుందని, గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మంగళవారం రాత్రికి ఈ తుపాను చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం సముద్రంలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను.. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ-విశాఖ మధ్య కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు.. కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు
తుపాను ప్రభావంతో బుధవారం గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో, గురువారం గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. బుధవారం నుంచి కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నెల 19, 20 తేదీల్లో కొన్ని చోట్ల 21 సెంటిమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. 21న కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది.