ఆంధ్రప్రదేశ్
ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవం
26-10-2026 14:25
ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
xPress24, Vijayawada, October 26,
విజయవాడ, అక్టోబర్ 26:
ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి తదితర దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం విశేష ఫలప్రదమని పండితులు పేర్కొంటారు.
దేవస్థానం అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తనలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
గిరి ప్రదక్షిణ ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకునేలా నిర్ణయించిన మార్గంలో కొనసాగనుంది.
ప్రదక్షిణ మార్గంలో వివిధ ప్రాంతాలకు చెందిన స్థానిక మహిళలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి వాహనానికి ముందు రహదారులను పసుపు నీటితో శుద్ధి చేశారు. హారతులు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి జయజయధ్వానాలు చేశారు.
గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమ, ప్రసాదాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని భక్తిని చాటుకున్నారు.