ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026
20-11-2026 16:02
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ భవానీ మండల దీక్షలు – 2026 శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి
xPress24, Vijayawada, November 20,
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ భవానీ మండల దీక్షలు – 2026 శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం మహామండపం ఆరో అంతస్తులో శ్రీ భవానీ అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి దీక్షా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన ఆలయం నుంచి శ్రీ భవానీ అమ్మవారి ఉత్సవమూర్తిని మహామండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శ్రీ వి. శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు శ్రీ కోట ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు శ్రీ నాగరాజు శాస్త్రి భక్తులకు భవానీ దీక్షా మాలాధారణ చేశారు. తొలిరోజే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి భవానీ దీక్షలు స్వీకరించారు. దీంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు భవానీ నామస్మరణతో మార్మోగాయి. దీక్షాధారులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
భవానీ మండల దీక్షలు స్వీకరించాలనుకునే భక్తులు నవంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దీక్షా మాలాధారణ చేసుకోవచ్చని దేవస్థానం వైదిక కమిటీ వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు బి. ధర్మారావు, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట రవికుమార్, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎన్. రమేష్ బాబు, కె. గంగాధర్, వేదపండితులు పాల్గొన్నారు.