తెలంగాణ
ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష
24-10-2026 09:36

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్రతో చర్చలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
xPress24, Hyderabad, October 23,
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ, డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు.
తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలు
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని మహారాష్ట్ర సీఎం ప్రతిపాదించినట్లు తెలిపారు. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే నీటి లభ్యత, ముంపు వివరాలను అధికారులు నివేదించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,00,000 ఎకరాలకు సాగునీరు అందించేలా నివేదికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటి తరలింపు
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీ, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఏదుల వరకు తెచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. దీనికి అవసరమైన పంప్‌హౌస్‌లు, పంపుల ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.