తెలంగాణ
ఇవాళ కొడంగల్‌లో రూ. 9,053 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
09-11-2026 15:33
కొడంగల్ నియోజకవర్గంలో మూడో రోజు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ. 9,053 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, నాచారం రేడియల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హకీంపేట్‌లో జరిగే భారీ రైతు బహిరంగ సభలో సీఎం ప్రసంగించి, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
xPress24, vikarabad, November 9,
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో మూడో రోజు పర్యటిస్తున్నారు. నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు రూ. 9,053 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ పలు ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు.
లగచర్లలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. నాచారం రేడియల్ రోడ్డు పనులకు శంకుస్థాపన
పర్యటనలో భాగంగా లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ప్రతిపాదిత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కర్మాగారం ఏర్పాటుతో స్థానిక రైతులకు పంట ఉత్పత్తుల మార్కెటింగ్ సౌలభ్యం కలగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రవాణా వ్యవస్థను మెరుగుపరిచే నాచారం రేడియల్ రోడ్డు నిర్మాణంతో పాటు ఇతర మౌలిక ప్రాజెక్టుల పనులకు కూడా సీఎం శ్రీకారం చుడతారు.
హకీంపేట్‌లో రైతు బహిరంగ సభ.. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
సాయంత్రం 5 గంటలకు హకీంపేట్ వేదికగా నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలుపై రైతులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.