తెలంగాణ
ఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
20-11-2026 16:23

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. 'సర్' పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ వైశ్యా భవన్ నుంచి కమాన్ వరకు నిర్వహించే మహా పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. ఈ పాదయాత్రకు లక్ష మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
xPress24, karimnagar, November 20,
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. 'సర్' పేరిట రాజ్యాంగ సంస్థలపై ఇండీ కూటమి, విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకత్వాన్ని పాతరేద్దాం' పేరిట నిర్వహించే మహా పాదయాత్రలో నితీన్ నబీన్ పాల్గొంటారని బీజేపీ నేతలు వెల్లడించారు. 23వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్న నితిన్ నబీన్, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడి నుంచి కరీంనగర్ వైశ్యా భవన్ వద్దకు చేరుకుని మహా పాదయాత్రను ప్రారంభిస్తారు. వైశ్యా భవన్ నుంచి టవర్ సర్కిల్, శాస్త్రీరోడ్ మీదుగా కమాన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌ఛార్జీలు రేఖా శర్మ, అభయ్ పాటిల్ పాల్గొంటారు.
జన సమీకరణపై బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్
నితిన్ నబీన్ తొలిసారి కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో లక్ష మందితో మహా పాదయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పాదయాత్ర ఏర్పాట్లపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఇతర ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మారుమూల గ్రామాల నుంచి కార్పొరేషన్ వరకు కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేలా పోలింగ్ బూత్, మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని కోరారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై విపక్షాలు చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తరలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు.