తెలంగాణ
ఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలు
17-11-2026 11:34

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నియామక ప్రక్రియలో సంస్కరణలను అమలు చేస్తోంది. సీబీఆర్‌టీ పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలను ప్రకటిస్తూ, ఒక దశ పరీక్షలను మూడు నెలల్లో, రెండు దశల పరీక్షలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పీసీబీ, ఆర్అండ్‌బీ నియామకాల్లో ఈ విధానాన్ని అమలు చేశామని, భవిష్యత్తులో అన్ని పరీక్షలకు దీనిని కొనసాగిస్తామని ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
xPress24, Hyderabad, November 17,
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణలను అమలు చేస్తోంది. నోటిఫికేషన్ జారీ నుంచి తుది ఎంపిక వరకు జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్‌టీ) ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలను ప్రకటిస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దరఖాస్తులకు ఒక నెల, సన్నద్ధతకు రెండు నెలల సమయం కేటాయించి, పరీక్ష తేదీలను ప్రకటించిన 25 రోజుల్లోపే సీబీఆర్‌టీ నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ ఎనలిస్ట్ గ్రేడ్-2, రోడ్లు, భవనాల శాఖ నియామకాలకు ఈ విధానాన్ని అమలు చేసి మూడు వారాల్లోపే తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది.
ఆరు నెలల్లోపే నియామక ప్రక్రియ పూర్తి: టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
భవిష్యత్తులో నిర్వహించే అన్ని పరీక్షలకు ఇదే విధానాన్ని అనుసరిస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఒకే దశలో పరీక్షలు ఉండే నియామకాలను మూడు నెలల్లోపు, రెండు దశల్లో పరీక్షలు ఉండే ప్రక్రియలను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలన్నదే కమిషన్ లక్ష్యమని తెలిపారు. పరీక్ష ముగిసిన వెంటనే ప్రాథమిక కీ విడుదల చేయడం, వివాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 26న పీసీబీ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు బుధ, గురువారాల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిపి, రెండు మూడు రోజుల్లో తుది ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్షల ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఈ నెల 17 వరకు గడువు ఇవ్వగా, నెలాఖరులోగా తుది జాబితా విడుదల చేయనున్నారు.