ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి
22-10-2026 15:59

మున్సిపల్ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు.
xPress24, Paravathipuram, October 22,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 22:
మున్సిపల్ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. గురువారం పార్వతీపురంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకూడదని, ఎవరైనా భోజనం లేదా కూల్‌డ్రింక్స్ అందించినా స్వీకరించకూడదని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడకుండా, వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకుండా ఎన్నికల విధులను నిర్వర్తించాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్ల వినియోగానికి సంబంధించి నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ మాత్రమే సెల్‌ఫోన్ కలిగి ఉండాలని, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ సిబ్బంది ఫోన్లను తమ వద్ద ఉంచుకోకూడదని సూచించారు.
దొంగ ఓట్లను నివారించేందుకు ఓటరు గుర్తింపు కార్డును క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటరు వేలికి సరైన విధంగా సిరా గుర్తు వేసి, అది ఆరిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతించాలని వివరించారు. పోలింగ్ రోజున ఎలాంటి ఆలస్యం జరగకుండా సిబ్బంది నిర్ణీత సమయానికి కనీసం గంట ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి పోలింగ్ ముగింపు అనంతరం సీలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కేంద్రాల్లో జరిగే ప్రతి కార్యకలాపానికి పోలింగ్ సిబ్బందే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది, హెల్పర్ల సహకారంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ల హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా చదివి, అందులోని మార్గదర్శకాలు, విధివిధానాలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, విధుల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన కోరారు.