ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
30-10-2026 14:36
ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
xPress24, Vijayawada, October 30,
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, కొండపల్లి మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 222 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1,142 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మేయర్ పదవికి విజయవాడలో 19 మంది, నందిగామలో 5 మంది, జగ్గయ్యపేటలో 7 మంది, తిరువూరులో 7 మంది, కొండపల్లిలో 8 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే వార్డు సభ్యులుగా విజయవాడలో 349 మంది, నందిగామలో 75 మంది, జగ్గయ్యపేటలో 94 మంది, తిరువూరులో 79 మంది, కొండపల్లిలో 106 మంది పోటీ చేస్తున్నట్లు వివరించారు.
ఎన్నికల ఏర్పాట్లను జనరల్, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలకు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు పెద్దగా తీవ్రమైన ఫిర్యాదులు ఏవీ అందలేదని తెలిపారు.
పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.