ఆంధ్రప్రదేశ్
ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 714 ప్రాజెక్టులకు రూ.22.61 లక్షల కోట్ల ఒప్పందాలు
13-11-2026 09:35

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు 714 ప్రాజెక్టులకు సంబంధించి రూ.22.61 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.
xPress24, Visakhapatanam, November 12,
విశాఖపట్నం:
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు 714 ప్రాజెక్టులకు సంబంధించి రూ.22.61 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో ప్రారంభమైన 31వ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న మంత్రి, అనంతరం మీడియా కేంద్రంలో మాట్లాడారు.
మొత్తం ఒప్పందాల్లో 526 ప్రాజెక్టులకు (74 శాతం) సంబంధించి రూ.17.10 లక్షల కోట్ల విలువైన భూములు, ప్రోత్సాహకాల కేటాయింపులకు ఆమోదం లభించిందన్నారు. రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు రూ.13 నుంచి 14 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయని, మరో రూ.15 నుంచి 16 లక్షల కోట్ల పెట్టుబడులను అవగాహన ఒప్పందాల (ఎంవోయూల) రూపంలో తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
విశాఖలో జరుగుతున్న సదస్సు విజయవంతమైందని, వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. పారిశ్రామిక రంగంలోని ప్రముఖులు ఒకే వేదికపై సమావేశమై తమ అవసరాలు, అవకాశాలను పరస్పరం చర్చించుకోవడానికి ఈ సదస్సు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతే ప్రధాన కారణమని అన్నారు.
పెట్టుబడిదారులకు భద్రత, అనుకూల వాతావరణం కల్పించడంతోపాటు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందనే నమ్మకాన్ని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 30కి పైగా నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చిందన్నారు. డేటా సెంటర్, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందించినట్లు తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను వేగంగా అందించేందుకు ఎస్క్రో ఖాతాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆలోచన చేయడం వినూత్నమని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల పెట్టుబడులకు ఎలాంటి ఆటంకం, నష్టం కలగకుండా భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని వివరించారు.
సదస్సులో పారిశ్రామికవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోందన్నారు. రాష్ట్ర అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు.
యువతకు కేవలం విద్య అందించడమే కాకుండా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కళాశాలల్లో పాఠ్యప్రణాళిక రూపొందించడం, చదువు పూర్తిచేసిన విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ అందించడం ప్రాధాన్యతాంశాలని తెలిపారు.
విశాఖపట్నం, తిరుపతి, అమరావతి క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిశ్రమలతోపాటు సాగునీటి, వ్యవసాయ రంగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని, మరో ఏడు నుంచి ఎనిమిది నెలల్లో దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన పోలవరాన్ని జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన 31 సాగునీటి ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేందుకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు.
రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం జీ రామ్ జీ పథకంతోపాటు ఇతర పథకాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల మేర నిధులను వినియోగించి గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు పేరున్న సంస్థలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.