ఆంధ్రప్రదేశ్
ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ
22-10-2026 15:59

ఏలూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
xPress24, Eluru, October 22,
ఏలూరు: ఏలూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియకు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి నామినేషన్ కేంద్రానికి ఒక ఎస్‌ఐని నియమించడంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీఐ స్థాయి అధికారులను ప్రత్యేక ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే కేంద్రంలోకి ప్రవేశించేందుకు అనుమతి కల్పించారు.
నామినేషన్ల సందర్భంగా ఎవరైనా బెదిరింపులకు గురైనా, ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌ను లేదా అత్యవసర నంబర్ 112, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 9550351100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులందరికీ పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.