జాతీయం
ఐటీబీపీ సిబ్బందికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
24-10-2026 11:49

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
xPress24, Delhi, October 24,
హిమవీరులు ప్రదర్శించే అసాధారణ శౌర్యం, పట్టుదల, నిస్వార్థ సేవలు దేశానికి అపారమైన స్ఫూర్తిని ఇస్తున్నాయని ప్రశంసించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ 65వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఐటీబీపీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని.. సరిహద్దుల్లో ఐటీబీపీ దళాలు అందిస్తున్న అసాధారణ సేవలను, వారి పట్టుదలను కొనియాడారు. హిమవీరులుగా పేరొందిన ఈ జవాన్లు ప్రతి కఠిన సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని గుర్తుచేశారు. దేశ రక్షణలో వారు చేస్తున్న త్యాగాలు దేశప్రజలందరికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
1962 అక్టోబర్ 24న ఏర్పడిన ఐటీబీపీ.. భారత్-చైనా సరిహద్దు భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. లడఖ్‌లోని కారకోరం కనుమ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జాచెప్ లా వరకు విస్తరించి ఉన్న 3,488 కిలోమీటర్ల పొడవైన కఠినమైన సరిహద్దు ప్రాంతాలను ఈ సాయుధ బలగాలు నిరంతరం పరిరక్షిస్తున్నాయి. మంచు తుఫానులు, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ దేశ భద్రతే ధ్యేయంగా సేవలందిస్తున్న ఐటీబీపీ జవాన్ల నిబద్ధతను ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.