క్రీడలు
ఐసీసీ ఛైర్మన్ గా వరుసగా రెండోసారి జై షా ఎకగ్రీవం
16-11-2026 12:22

ఐసీసీ ఛైర్మన్ గా జై షా వరుసగా రెండోసారి ఎకగ్రీవంగా ఎన్నికైయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో బోర్డు ఆయన ఎన్నికను ప్రకటించింది.
xPress24, Hyderabad, November 16,
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ గా జై షా మరోసారి పునర్నియామకం అయ్యారు. వరుసగా రెండోసారి ఆయన ఏకగ్రీవంగా బోర్డు ఛైర్మన్ గా ఎంపికయ్యారు. తాజాగా బాలిలో జరిగిన సమావేశంలో ఐసీసీ డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించగా.. బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో రానున్న రెండేళ్లపాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇక తన నియామకంపై జై షా స్పందించారు. బోర్డు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే తనపై విశ్వాసం ఉంచి.. నిరంతరం మద్దతుగా నిలుస్తున్న డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి బోర్డు సభ్యులతో కలిసి పనిచేస్తానని అన్నారు.
"మనం మన క్రీడా చరిత్రలోనే అత్యంత కీలక దశలోకి ప్రవేశిస్తున్నాం. 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ తిరిగి వస్తుంది. దీంతో మన ఆటను కొత్త ప్రేక్షకులకు పరిచయం చేయడానికి, కొత్త తరం ఆటగాళ్లను, అభిమానులను ప్రేరేపించడానికి ఇది మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈవెంట్‌లను విజయవంతంగా నిర్వహించడం మాత్రమే మన బాధ్యత కాదు. అభిమానులు, అథ్లెట్లు, వాణిజ్య, ఇతర కీలక భాగస్వాములపై దృష్టి సారించి, క్రికెట్ కు మరింత బలమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించాలి" అని జై షా పేర్కొన్నారు.
కాగా, ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికకు ముందు జై షా 2019లో బీసీసీఐ సెక్రటరీగా పనిచేశారు. ఆయన పదవీకాలంలో భారత క్రికెట్ అనేక కీలక పరిణామాలు జరిగాయి. ఐపీఎల్ మీడియా హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడవడం, మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభం, టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ పథకాన్ని కూడా ఆయన పదవీకాలంలోనే ప్రవేశ పెట్టారు. అలాగే 2021-2024 మధ్యలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ గానూ పనిచేశారు. ఆ తర్వాత జై షా 2024 డిసెంబర్ లో తొలిసారి ఐసీసీ ఛైర్మన్ గా ఎంపికైయ్యారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ దాకా ఉంది. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో మరో రెండేళ్లపాటు బోర్డుకు ఆయనే చీఫ్ గా కొనసాగనున్నారు.