తెలంగాణ
ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే నిరసనకు ములుగు నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు: మంత్రి సీతక్క
31-10-2026 12:12
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, ఆ హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు రాంలీలా మైదానంలో నిర్వహించే ఓటు చోరీ వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిపారు.
xPress24, Mulugu, October 31,
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓట్ చోరీ’ వ్యతిరేక నిరసన కార్యక్రమానికి ములుగు జిల్లా, నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడటం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, ఆ హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని అన్నారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరుతున్నారని తెలిపారు. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా పార్టీ శ్రేణులు ఢిల్లీ చేరుకుని నవంబర్ 1న నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ములుగు జిల్లా, నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నాయని చెప్పారు.
ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమమని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండటం అత్యంత ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు. ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ప్రతి అర్హుడైన ఓటరుకు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. ఓటు చోరీకి పాల్పడుతున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడటంలో ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల మద్దతు లభిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు.
బైట్: ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి