ఆంధ్రప్రదేశ్
కాకినాడ జడ్పీ చైర్‌పర్సన్‌గా బుర్రా దివ్య సునీత రాజ్ ఏకగ్రీవ ఎన్నిక
21-11-2026 09:47
కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు
xPress24, Kakinada, November 20,
కాకినాడ: కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జడ్పీ ప్రత్యేక అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకురాలు బి. లావణ్య వేణి, జడ్పీ సీఈఓ కె. లక్ష్మణరావు తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తొలుత నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులను అక్షర క్రమంలో పిలిచి జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ పదవికి పెద్దాపురం జడ్పీటీసీ బుర్రా దివ్య సునీత రాజ్ పేరును తొండంగి జడ్పీటీసీ కోడ వెంకటరమణ ప్రతిపాదించగా, యు. కొత్తపల్లి జడ్పీటీసీ తెలగంశెట్టి శ్యామల బలపరిచారు. మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో బుర్రా దివ్య సునీత రాజ్‌ను చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు.
అదేవిధంగా వైస్ చైర్‌పర్సన్ పదవికి కరప జడ్పీటీసీ పంపన రాజేశ్వరి దేవి పేరును పెదపూడి జడ్పీటీసీ రావాడ నాగేశ్వరరావు (నాగు) ప్రతిపాదించగా, గండేపల్లి జడ్పీటీసీ మంగిన గనిలక్ష్మి బలపరిచారు. మరో అభ్యర్థి లేకపోవడంతో పంపన రాజేశ్వరి దేవిని వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా చైర్‌పర్సన్ బుర్రా దివ్య సునీత రాజ్, వైస్ చైర్‌పర్సన్ పంపన రాజేశ్వరి దేవి అధికారిక ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి, జడ్పీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, జడ్పీ సిబ్బంది కూడా నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లకు అభినందనలు తెలియజేశారు.
ప్రమాణ స్వీకారానికి దూరంగా పిల్లి అనంతలక్ష్మి
మరోవైపు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్ పదవి దక్కకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు కాకినాడ రూరల్ జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె చైర్‌పర్సన్ పదవిని ఆశించారు. అయితే కూటమి పార్టీల మధ్య జరిగిన సర్దుబాట్లలో ఆ పదవి జనసేన పార్టీకి కేటాయించడంతో ఆమెకు వైస్ చైర్‌పర్సన్ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దానిని ఆమె తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం జరిగిన జడ్పీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పిల్లి అనంతలక్ష్మి, తన వంతు రాకముందే సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆమె ప్రమాణ స్వీకారం చేయలేదు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, లోక్‌సభ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, డిప్యూటీ సీఈఓ లలిత, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.