తెలంగాణ
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని హరీశ్ రావు విమర్శ
24-10-2026 14:47

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అధికారుల వైఖరిని, విద్యుత్ సరఫరా గురించి ప్రశ్నించిన రైతుపై పోలీసు లాఠీఛార్జ్‌ను నిరసించారు.
xPress24, Hyderabad, October 24,
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులపై జరుగుతున్న అణచివేత చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భూ సమస్యలు, సాగు నీరు, విద్యుత్ కష్టాలపై అధికారులను ఆశ్రయిస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఓ రైతును ఉద్దేశించి "నువ్వు ఇంకా సచ్చిపోలేదా?" అని అధికారి మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
పొలాలకు ఉచిత విద్యుత్ సరఫరాపై నిలదీసిన మరో రైతు ముఖంపై ఎస్సై లాఠీలతో దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని హరీష్ రావు తప్పుబట్టారు. అన్నదాతలకు అండగా నిలవాల్సిన పోలీసులే ఇలా భౌతిక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. ఇది ప్రజల సంక్షేమం కోరే 'ప్రజా పాలన' కాదని, రైతులను బతకనివ్వని 'రాక్షస పాలన' అని విమర్శించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుండా.. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.