తెలంగాణ
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావు
17-11-2026 18:13

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. గాంధీభవన్ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన హామీలపై మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
xPress24, Hyderabad, November 17,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి మూడేళ్లు పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. 'అభయహస్తం' కాస్తా హామీలను అమలు చేయని శూన్య హస్తంగా మారిందని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, దానిని తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల క్రితం ఇదే రోజున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని హరీశ్ రావు గుర్తుచేశారు. గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తూ.. దీనికి మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏది?
అధికారంలోకి వచ్చిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ నెరవేరలేదని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును గాలికొదిలేసిందని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా మూడేళ్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారని, కాంగ్రెస్ వైఖరిని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారని హరీశ్ రావు తన పోస్టులో వెల్లడించారు.