తెలంగాణ
కొడంగల్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
07-11-2026 10:02
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సుమారుగా రూ. 9 వేల 100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 ప్రధాన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు.
xPress24, Vikarabad, November 7,
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 9వేల 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా హకీంపేట చేరుకుని మెగా రైతు మేళా, పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం లగచర్లలో 81 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే 5వేల 60 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2 పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల ప్రాంతాల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల భవనాలను ప్రారంభించనున్నారు. ఎల్లుండి 10 జిల్లాల నుంచి హాజరయ్యే 50 వేల మంది రైతులతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.