తెలంగాణ
కొత్త ఏడాదిలో అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం: మంత్రి దామోదర
12-11-2026 14:29
వచ్చే నెల చివరి నాటికి అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి కొత్త ఏడాదిలో ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
xPress24, Hyderabad, November 12,
వచ్చే నెల చివరి నాటికి అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి కొత్త ఏడాదిలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఓపీ విభాగం, డయాగ్నొస్టిక్స్, సీటీ స్కాన్, ఎక్స్ రే విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, ఇతర వైద్య విభాగాలను స్వయంగా పర్యవేక్షించారు. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి సివిల్, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అనుబంధ టీచింగ్ ఆసుపత్రిగా అభివృద్ధి
రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి విభాగాన్ని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. అల్వాల్ టిమ్స్‌ను కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధ టీచింగ్ ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా మెడికల్ కాలేజీ భవనాలు, హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రాంగణంలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు
ఆసుపత్రి ప్రాంగణంలో నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. దీనివల్ల వైద్య విద్యార్థులకు మెరుగైన శిక్షణా అవకాశాలతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.