తెలంగాణ
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
20-11-2026 16:23

కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ సాంకేతికతల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మార్ఫింగ్, డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్ నిరోధానికి పలు సూచనలు చేస్తూ సినీ నటుడు చిరంజీవి రాసిన లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అందజేసినట్లు వెల్లడించారు. కళాకారుల ముందస్తు అనుమతి లేకుండా వారి రూపం, గొంతును వినియోగించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని, అక్రమ కంటెంట్‌పై వేగంగా చర్యలు తీసుకోవాలని చిరంజీవి తన లేఖలో కోరారు.
xPress24, hyderabad, November 20,
కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా సినీ నటుడు చిరంజీవి ఏఐ దుర్వినియోగం, సినీనటులు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో సాంకేతికత ఆధారంగా సృష్టిస్తున్న సమస్యలను వివరించారని పేర్కొన్నారు. తాజాగా మార్ఫింగ్, డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్ వంటి చర్యలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ అమిత్ షాకు చిరంజీవి రాసిన లేఖను తాను వ్యక్తిగతంగా అందజేసినట్లు కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కళాకారుల అనుమతి లేకుండా వారి ముఖం, గొంతు, సృజనాత్మక పనులను డిజిటల్‌గా పునఃసృష్టించడం వల్ల వారు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని చిరంజీవి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అనుమతి లేని కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.. ప్లాట్‌ఫామ్‌లపైనా నియంత్రణ అవసరం
వ్యక్తులు, కళాకారుల ముఖాలు, గొంతు, ప్రదర్శనలను డిజిటల్ రూపంలో సృష్టించడానికి లేదా మార్పులు చేయడానికి ముందు వారి ముందస్తు సమ్మతి తప్పనిసరి చేసేలా చట్టపరమైన రక్షణ కల్పించాలని చిరంజీవి కోరారు. దురుద్దేశాలతో డీప్‌ఫేక్ సృష్టించడం, పరువునష్టం కలిగించడం వంటి చర్యలపై సివిల్, క్రిమినల్ చట్టాల కింద కఠిన శిక్షలు విధించాలని, చట్టవిరుద్ధ కంటెంట్‌ను వెంటనే తొలగించేలా ఫిర్యాదుల వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఏఐ టూల్స్ నిర్వాహకులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సర్వీస్ ప్రొవైడర్లపైనా నియంత్రణలు, జరిమానాలు విధించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సినీ, టీవీ సంఘాలు, న్యాయ నిపుణులతో సంప్రదించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని, యూకే క్రైమ్ అండ్ పోలీసింగ్ యాక్ట్-2026 తరహాలో ప్రపంచ దేశాల్లోని నిబంధనలను అధ్యయనం చేయాలని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించారని కిషన్ రెడ్డి తెలిపారు.