జాతీయం
కేంద్ర కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు
26-11-2026 11:57

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దేశ మౌలిక సదుపాయాల కల్పన, రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
xPress24, Delhi, November 25,
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దేశ మౌలిక సదుపాయాల కల్పన, రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోస్టల్ వ్యవస్థ ఆధునీకరణ, అస్సాంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం, తమిళనాడులోని కామరాజర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలను వెల్లడించారు.
ఈ సదర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా1.5 లక్షల పోస్టాఫీసుల నెట్‌వర్క్ ఆధునీకరణకు రూ.1,141 కోట్ల వ్యయంతో పోస్టల్ ఆపరేషన్స్ స్కీమ్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. గత 12 ఏళ్లలో తపాలా శాఖలో అనేక సంస్కరణలు వచ్చాయని, బ్రిటిష్ కాలం నాటి పోస్టల్ చట్టం స్థానంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాన్ని తెచ్చామన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఉత్తరాల నుంచి పార్శిల్స్ వైపు మారుతున్న నేపథ్యంలో, తపాలా శాఖ కూడా పూర్తిస్థాయి పార్శిల్ ఆధారిత కార్యకలాపాలకు మారిందన్నారు. ఈ పథకం ద్వారా మెయిల్, పార్శిల్ సేవల ఆధునీకరణ, గ్రామీణ పోస్టాఫీసులకు కొత్త భవనాల నిర్మాణంతోపాటు రవాణా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూ.1,491 కోట్లతో ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ స్కీమ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.
ఈశాన్య రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు అస్సాంలోని కచార్ జిల్లా డోలు వద్ద రూ.2,014 కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ప్రస్తుత సిల్చార్ ఎయిర్‌పోర్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుందని, భౌగోళిక పరిమితుల వల్ల అక్కడ రన్‌వేను విస్తరించడం కష్టంగా మారిందని అశ్విని వైష్ణవ్ వివరించారు. అస్సాం రాష్ట్రానికి గౌహటి విమానాశ్రయం కీలకంగా మారినట్లే..మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ వంటి పొరుగు రాష్ట్రాలకు కొత్త సిల్చార్ విమానాశ్రయం కూడా అనుసంధానతను మెరుగుపరుస్తుందన్నారు. ఇది ఈశాన్య ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడులోని కామరాజర్ పోర్ట్‌ను రూ.4,288 కోట్లతో భారీ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోర్ట్‌కు విస్తృతమైన పరివాహక ప్రాంతం ఉందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చెన్నై, శ్రీపెరంబుదూర్, గుమ్మిడిపూండి వంటి ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ జోన్లకు ఈ పోర్ట్ సేవలందిస్తుందని వెల్లడించారు. భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాలు తయారయ్యే ఈ ప్రాంతాలకు పోర్ట్ అనుసంధానత పెరగితే తయారీ రంగ కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయన్నారు. దీంతో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి భారీ ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.