తెలంగాణ
కొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టి
26-10-2026 11:23
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘కొరియా కల్చర్ డే–2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. కొరియా, తెలంగాణ సంస్కృతుల సమ్మేళనంగా కార్యక్రమం సాగింది. ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
xPress24, Hyderabad, October 26,
దక్షిణ కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ‘కొరియా కల్చర్ డే–2026’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌ల మధ్య సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో దక్షిణ కొరియా సంస్థలతో కలిసి పని చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. పర్యాటక రంగంలో ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడించారు.
కొరియా, తెలంగాణ సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొస్తూ నిర్వహించిన ‘కె-హార్మొనీ ఫెస్టా’ అందరినీ ఆకట్టుకుంది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ ‘కె-హార్మొనీ ఫెస్టా’ను నిర్వహించారు. కొరియన్ పాప్ మ్యూజిక్, ఉత్కంఠభరితమైన తైక్వాండో విన్యాసాలతో పాటు తెలంగాణ పేరిణి నృత్యాలు, జానపద డప్పు చప్పుళ్లు ఈ వేడుకకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడులు, పరస్పర అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ వేడుక అట్టహాసంగా సాగింది.