ఆంధ్రప్రదేశ్
గుంటూరు రైల్వే స్టేషన్‌లో దత్తత ప్రక్రియపై అవగాహన కార్యక్రమం
12-11-2026 09:41

జాతీయ దత్తత అవగాహన మాసాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
xPress24, Guntur, November 11,
గుంటూరు, నవంబర్ 11:
జాతీయ దత్తత అవగాహన మాసాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం గుంటూరు రైల్వే స్టేషన్‌లో రైల్వే సిబ్బంది, ప్రయాణికులు, ప్రజలకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ, ఉయ్యాల కార్యక్రమంపై అవగాహన కల్పించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి దుర్గాభవాని పాల్గొని మాట్లాడుతూ.. రోడ్లపై లేదా ఇతర ప్రాంతాల్లో వదిలివేయబడిన శిశువులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అర్హులైన దంపతులకు పిల్లలను చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా దత్తత ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అలాగే బాల్యవివాహ రహిత భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని ప్రోత్సహించినా, నిర్వహించినా ఎదురయ్యే చట్టపరమైన చర్యల గురించి వివరించారు. ఆపదలో ఉన్న బాలల వివరాలను 1098 నంబర్‌కు తెలియజేస్తే వారికి తగిన రక్షణ, సంరక్షణ కల్పిస్తామని దుర్గాభవాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ ఏ. సాయికృష్ణ, స్టేషన్ మాస్టర్ జి. నాగేశ్వరరావు, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.