తెలంగాణ
గతంలో రాజకీయ పునరావాస కేంద్రంగా ఉండేది - కొత్త DSPలతో సీఎం రేవంత్
11-11-2026 12:47
MCRHRDలో శిక్షణ పూర్తి చేసుకున్న డిఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రూప్-1 నియామకాలు ఆలస్యమయ్యాయన్న సీఎం. రాష్ట్ర భవిష్యత్తు 30 ఏళ్లు మీ చేతుల్లోనే ఉందని కొత్త అధికారులకు సూచించిన రేవంత్
xPress24, Hyderabad, November 11,
గతంలో గ్రూప్-1 నియామకాల ప్రక్రియ చాలా ఆలస్యంగా జరిగేదని... ఆనాటి ప్రభుత్వ నిర్ణయాలు, నిర్లక్ష్యం చాలా మందికి తీరని నష్టాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీలతో MCRHRDలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టాక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, నియామక ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. గతంలో రాజకీయ పునరావాస కేంద్రంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేదని విమర్శించారు. అవగాహన లేనివారిని బోర్డులో నియమించి గత ప్రభుత్వం తప్పు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును రాబోయే 30 ఏళ్లు ఎలా నడిపించాలో నూతన డీఎస్పీల చేతుల్లోనే ఉందన్నారు. అధికారుల నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారతాయని చెప్పారు. బాధ్యత గుర్తించి నిజాయితీగా విధులు నిర్వర్తించాలని మాత్రమే ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు. సర్వం ఒడ్డి శాంతిభద్రతలు కాపాడి, పోలీసుల గౌరవాన్ని సీనియర్లు పెంచారన్న సీఎం... పోలీసు శాఖ విశ్వాసమైన విభాగంగా కొనసాగించాల్సిన బాధ్యత నూతన డీఎస్పీలపై ఉందన్నారు.