ఆంధ్రప్రదేశ్
గ్యాస్ లీకేజీ ఘటనను సమర్థవంతంగా ఎదుర్కొన్న జిల్లా యంత్రాంగం
18-11-2026 10:00
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నగరం గ్రామ సమీపంలో తాటిపాక-7 ఓఎన్‌జీసీ వెల్ రిగ్ వద్ద మంగళవారం చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనను జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
xPress24, Amalapuram, November 17,
అమలాపురం:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నగరం గ్రామ సమీపంలో తాటిపాక-7 ఓఎన్‌జీసీ వెల్ రిగ్ వద్ద మంగళవారం చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనను జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, పి. గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామ సమీపంలోని తాటిపాక-7 రిగ్ వద్ద గ్యాస్ లీకేజీని ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి పూర్తిగా అరికట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని వెల్లడించారు.
గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టిందని తెలిపారు. రిగ్ చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో నివసిస్తున్న సుమారు 200 నుంచి 300 కుటుంబాలను గుర్తించి, తక్షణమే సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. అక్కడ బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.