ఆంధ్రప్రదేశ్
గ్రామ పంచాయతీ ఎన్నికల ఆర్వోలకు శిక్షణ
30-10-2026 09:52
గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశించారు.
xPress24, Palanadu, October 29,
పల్నాడు జిల్లా, అక్టోబర్ 29:
గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం నిర్వహించిన ఆర్వోల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఎన్నికల విధివిధానాలు, నిబంధనల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలోనూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా కేంద్రాల్లో సిబ్బంది నియామకం, విధుల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు కేంద్రాల లోపల, వెలుపల జరిగే పరిణామాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి 14 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని కలెక్టర్ వివరించారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరిస్తారని, అనంతరం నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలను నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.
నామినేషన్ పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని, పరిశీలన సమయంలో వాటిని ఇతరుల చేతికి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఏదైనా నామినేషన్‌ను తిరస్కరించినప్పుడు సంబంధిత అభ్యర్థి లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే, తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా పేర్కొంటూ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. నామినేషన్ తిరస్కరణపై నిబంధనల ప్రకారం అప్పీల్ చేసుకునేందుకు ఆర్డీఓను ఆశ్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులను ఎవరైనా అడ్డుకున్నట్లు ఫిర్యాదులు అందినా, పోలీసు రక్షణ కోరుతూ అభ్యర్థులు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసినా అధికారులు వెంటనే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత దరఖాస్తులను పోలీసు అధికారులకు పంపించి, అభ్యర్థులకు అవసరమైన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఎన్నికల గుర్తులను తెలుగు వర్ణమాల క్రమంలో అమర్చాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం అమలు చేస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.