ఆంధ్రప్రదేశ్
గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
19-11-2026 09:48

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
xPress24, Bapatala, November 18,
బాపట్ల, నవంబర్ 18:
గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి, గ్రామ పంచాయతీ పరిధిలోని 14 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వీటిలో 10 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా, మిగిలిన నాలుగు కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
గత ఎన్నికల సమయంలో బేతపూడి పంచాయతీలో చోటుచేసుకున్న సంఘటనలు, వాటి నివారణకు తీసుకున్న భద్రతా చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 5,250 మంది జనాభా ఉండగా, 3,176 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పంచాయతీలో 14 వార్డులు ఉండగా, ప్రతి వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వెదుళ్లపల్లి, బేతపూడి, స్టువర్టుపురం గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను బేతపూడిలోనే నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.