ఆంధ్రప్రదేశ్
గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు
10-11-2026 09:55

గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత, హస్తకళాకారులు తమ నైపుణ్యంతో రూపొందించే సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ‘స్టాల్ ఇన్ మాల్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాబార్డు ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) సోమేందర్ సింగ్ అన్నారు.
xPress24, Vijayawada, November 9,
విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత, హస్తకళాకారులు తమ నైపుణ్యంతో రూపొందించే సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ‘స్టాల్ ఇన్ మాల్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాబార్డు ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) సోమేందర్ సింగ్ అన్నారు.
సోమవారం ఎంజీ రోడ్డులోని పీవీపీ స్క్వేర్ మాల్‌లో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ సీజీఎం సోమేందర్ సింగ్, నేస్తం ఫౌండేషన్ సీఈవో సురేష్ వేసంతో కలిసి ‘స్టాల్ ఇన్ మాల్’ స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత, హస్తకళాకారులతో మాట్లాడి వారు తయారుచేసిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సోమేందర్ సింగ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు, సంప్రదాయ కళాఖండాలను నగరాల్లోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో ప్రదర్శించడం ద్వారా కళాకారులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను నేరుగా పట్టణ ప్రాంత వినియోగదారులకు పరిచయం చేయడం వల్ల మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించవచ్చన్నారు. వినియోగదారులు ఉత్పత్తులను నేరుగా పరిశీలించి కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో కళాకారులకు తగిన గుర్తింపుతో పాటు మెరుగైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ కళాకారుల ఉత్పత్తులను పట్టణ వినియోగదారులకు చేరువ చేయడంతో పాటు సంప్రదాయ కళలు, చేనేత వస్త్రాలు, హస్తకళలపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులతో పాటు చేనేత, హస్తకళలను నాబార్డు అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు.
నేస్తం ఫౌండేషన్ సీఈవో సురేష్ వేసం మాట్లాడుతూ, చేనేత రంగం, హస్తకళలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. తరతరాలుగా కళాకారులు తమ నైపుణ్యంతో ఈ కళలను పరిరక్షిస్తూ వస్తున్నారని తెలిపారు. ‘స్టాల్ ఇన్ మాల్’ స్టాళ్లు ఈ నెల 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించడం, కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం, వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా నాబార్డు ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాబార్డు, నేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ కళాకారులకు కొత్త మార్కెటింగ్ అవకాశాలు లభించడంతో పాటు వారి ఉత్పత్తులకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ స్టాళ్లను సందర్శించి చేనేత, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.