ఆంధ్రప్రదేశ్
గొల్లపూడిలో ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ
30-10-2026 12:40

గొల్లపూడిలో ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
xPress24, Vijayawada, October 30,
జయవాడ: గొల్లపూడిలో ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా భూమిపూజ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, వేద విజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా విశిష్టమైన గుర్తింపు ఉందన్నారు. వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించడంలో ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరానికి మరో ఆధ్యాత్మిక కేంద్రం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక చింతన, సాంస్కృతిక విలువలు, భారతీయ సంప్రదాయాలపై మరింత అవగాహన కలుగుతుందన్నారు. ఆధునిక సమాజంలో యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వేద విజ్ఞానంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, ఆధ్యాత్మికత మనిషిలో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు సమాజంలో సానుకూల ఆలోచనలకు దోహదపడుతుందని వివరించారు.
విజయవాడ నగరం ఇప్పటికే ఆధ్యాత్మికంగా విశిష్టమైన గుర్తింపు పొందిందని, ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంతో పాటు పలు పుణ్యక్షేత్రాలు నగరానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణం నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను మరింత పెంచుతుందని, భక్తులకు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఈ కేంద్రం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు.