ఆంధ్రప్రదేశ్
ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల పండగ
26-10-2026 14:29
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
xPress24, Vizianagaram, October 26,
విజయనగరం, అక్టోబర్ 26:
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలేళ్ల పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద భక్తులు బారులు తీరగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. భారీ సంఖ్యలో భక్తులు నగరానికి తరలిరావడంతో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి.
మాన్సాస్ ట్రస్ట్ తరఫున మహారాజా వంశీయులు పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తెలు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విద్యావతి దేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కోటలోని శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీదేవి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం తమ ఇలవేల్పు అయిన శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో ఆలయ విస్తరణ పనులను శరవేగంగా పూర్తి చేయగలిగామని తెలిపారు. ఈ పనులకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ఉత్తరాంధ్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.