ఆంధ్రప్రదేశ్
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు
12-11-2026 09:42

భారత విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేసిన మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి అన్నారు.
xPress24, Paravathipuram, November 11,
పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 11:
భారత విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేసిన మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి అన్నారు. బుధవారం పార్వతీపురంలోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప విద్యావేత్తగా దేశానికి విశేష సేవలందించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, దేశ విద్యా వ్యవస్థ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ఐఐటీలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 1992లో భారతరత్న పురస్కారం లభించిందని తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం డీఎస్పీ శేషయ్య, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నివాళులర్పించారు.