ఆంధ్రప్రదేశ్
జనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
10-11-2026 15:25
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 16వ జనగణన–2027 ప్రక్రియ రెండో దశను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు.
xPress24, Vizianagaram, November 10,
విజయనగరం, నవంబర్ 10:
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 16వ జనగణన–2027 ప్రక్రియ రెండో దశను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు.
డెంకాడ మండలం చింతలవలసలోని ఎం.వి.జి.ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా, ఛార్జ్ స్థాయి అధికారులకు నిర్వహిస్తున్న రెండో దశ జనగణన శిక్షణ కార్యక్రమంలో రెండో రోజు మంగళవారం కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్, అధికారుల అవగాహన స్థాయిని పరీక్షించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకొని, సమాచార సేకరణపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జనగణన ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా, అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రతి గణనాధికారి తమకు కేటాయించిన 40 రోజుల వ్యవధిలో సుమారు 800 మంది వివరాలను సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి కుటుంబంలోని సభ్యులందరినీ ఉద్దేశించి నిర్దేశించిన 40 ప్రశ్నలు అడిగి, వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
జనగణనలో సేకరించే కుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రాతిపదికగా పరిగణించబోమని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.