తెలంగాణ
జనగణనలో ఓబీసీ, ఆదివాసీ కాలమ్‌లు ఏర్పాటు చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ
02-11-2026 09:49

జనగణనలో ఓబీసీల కులాల నమోదుకు ప్రత్యేక కాలమ్, ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేయాలని కోరుతూ అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే జనగణనలో ఈ మార్పులు చేసేలా కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపాలని ఆమె డిమాండ్ చేశారు.
xPress24, Hyderabad, November 1,
రాబోయే దేశవ్యాప్త జనగణనలో ఓబీసీ కులాల గణన కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు కవిత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇంటింటి జనగణన ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని కోరారు.
ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం అన్యాయం
దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లు గడిచినా జనాభా దామాషా ప్రకారం ఫలితాలు అందడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీల జనాభాను ప్రత్యేక కాలమ్‌లో నమోదు చేయకపోవడం వల్ల వారిని ఇతర కులాల జాబితాలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. చట్టబద్ధమైన జనాభా లెక్కలు లేకపోవడమే ఓబీసీల వెనుకబాటుతనానికి కారణమని పేర్కొంటూ, కచ్చితమైన గణనతోనే సమాన ప్రాతినిధ్యం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఆదివాసీల ప్రత్యేక జీవన విధానానికి గుర్తింపునివ్వాలి
దేశ మూలవాసులైన ఆదివాసీల జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఎంతో విశిష్టంగా ఉంటుందని, గతంలో వారికి మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసుకునే అవకాశం ఉండేదని కవిత గుర్తుచేశారు. అయితే ప్రస్తుత జనగణనలో ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసే అవకాశం లేకుండా చేయడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆదివాసీల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని వారి మతాన్ని ప్రత్యేకంగా గుర్తించేలా కేంద్రాన్ని కోరాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ వేదికగా బలమైన గళం వినిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
బైట్స్
కల్వకుంట్ల కవిత, అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన (TRS)