తెలంగాణ
జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు పునరావాసం.. 214 మందికి రూ. 5.59 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ చేసిన డీజీపీ సీవీ ఆనంద్
24-11-2026 11:21
జనజీవన స్రవంతిలోకి వచ్చిన 214 మంది మావోయిస్టులకు డీజీపీ సీవీ ఆనంద్ రూ. 5.59 కోట్ల నగదు రివార్డులు, పునరావాస ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారికి ఆరోగ్య కార్డులు, ఇళ్లు, ఉపాధి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు గణపతి సహా మిగిలిన ముగ్గురు నేతలు కూడా లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని డీజీపీ కోరారు.
xPress24, Hyderabad, November 23,
జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, నివాస వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 214 మంది లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 5 కోట్ల 59 లక్షల 50 వేల నగదు రివార్డులు, పునరావాస ఆర్థిక సాయాన్ని డీజీపీ పంపిణీ చేశారు. అనంతరం సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు 754 మంది, తెలంగాణకు చెందినవారు 59 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వివిధ దశల్లో కలిపి ఇప్పటివరకు రూ. 17 కోట్ల 68 లక్షల 35 వేల నగదు అందించామన్నారు. లొంగిపోయిన వారికి 59 ఆరోగ్య కార్డులు జారీ చేశామని, తెలంగాణకు చెందిన పది మందికి ఇళ్లు మంజూరు కాగా మరో 49 మందికి ఇళ్లు కల్పించనున్నామని చెప్పారు.
కార్పెంటర్, డ్రైవింగ్ రంగాల్లో ఉపాధి శిక్షణ.. గణపతి సహా ముగ్గురు నేతలు లొంగిపోవాలని పిలుపు
లొంగిపోయిన వారికి కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వృత్తులతో పాటు ఆటో, ట్రాక్టర్ డ్రైవింగ్‌లో నైపుణ్య శిక్షణ అందిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. 2026 నాటికి తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో తొమ్మిది ఆయుధాల డంపులు గుర్తించి 252 తుపాకులు, 48 ఏకే-47 తుపాకులు, నాలుగు ఎల్‌ఎంజీలు, 359 బీజీఎల్ సెల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ల తొలగింపు పనులు కొనసాగుతున్నందున ప్రస్తుతం పర్యాటకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా ఇంకా మిగిలి ఉన్న ముగ్గురు కీలక నేతలు కూడా లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని డీజీపీ కోరారు.
బైట్స్
సీవీ ఆనంద్, తెలంగాణ డీజీపీ