జాతీయం
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతం
18-11-2026 15:52
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు. మసీదులోకి ప్రవేశించిన అతడిని లొంగిపోవాలని వీడియో కాల్ ద్వారా అధికారులు కోరినప్పటికీ నిరాకరించడంతో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మసీదుకు ఎలాంటి నష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామని కుల్గాం ఎస్ఎస్‌పీ అనాయత్ అలీ తెలిపారు. మరోవైపు కుల్గాం జిల్లా జలంగం పహ్లూ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది.
xPress24, Jammu kashmir, November 18,
జమ్మూకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదిగా భావిస్తున్న లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇటీవల సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కాల్పుల ఘటన అనంతరం సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. సోమవారం కుల్గాం జిల్లా లారూ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఉమర్ నాసిర్ దార్ అనే ఉగ్రవాది హతమవగా, లతీఫ్ భట్ బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. గాలింపు ముమ్మరం చేసిన భద్రతా దళాలు మంగళవారం తెల్లవారుజామున అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టాయి. లతీఫ్ మసీదులోకి ప్రవేశించడంతో నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కుల్గాం ఎస్ఎస్‌పీ అనాయత్ అలీ తెలిపారు. వీడియో కాల్ ద్వారా లొంగిపోవాలని అధికారులు కోరినప్పటికీ లతీఫ్ తిరస్కరించడంతో భద్రతా బలగాలు అతడిని హతమార్చాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జి.పి. సింగ్ 'ఎక్స్' వేదికగా పోలీసులను అభినందించారు.
నవంబర్ 11 దాడికి ముందు రెక్కీ.. కుల్గాంలో కొనసాగుతున్న మరో ఎన్‌కౌంటర్
నవంబర్ 11న కుల్గాంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై దాడికి ముందు నవంబర్ 10న లతీఫ్ భట్ మీర్ బజార్, అఖ్రాన్ హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో వెల్లడైంది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 15 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మరోవైపు కుల్గాం జిల్లా జలంగం పహ్లూ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సంయుక్త బృందాలు గాలింపు చేపట్టగా కాల్పులు జరిగాయని కశ్మీర్ జోన్ పోలీసులు 'ఎక్స్' ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది.