తెలంగాణ
జర్మనీలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
24-11-2026 12:13

పలు దేశాల్లో మానవ వనరుల కొరత దృష్ట్యా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జర్మనీలో తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలోని లోయర్ సాక్సనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంలో ఆయన చర్చలు జరిపారు.
xPress24, Hyderabad, November 24,
జర్మనీ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
స్థానిక యువతకు సరైన శిక్షణ ఇస్తే ఇరు ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సూచించారు. జర్మనీలోని లోయర్ సాక్సనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో
మంత్రి వివేక్ వెంకటస్వామి చర్చలు జరిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీలో లోయర్ సాక్సనీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
ఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, అంతర్జాతీయ కార్మిక ఉపాధి రంగాలలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు లోయర్ సాక్సనీ రాష్ట్ర మినిస్టర్-ప్రెసిడెంట్ ఒలాఫ్ లీస్ తో చర్చించినట్టు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యంపై చర్చించడంతో పాటు, టామ్‌కామ్‌లో ఆ రాష్ట్ర కార్యాలయ ఏర్పాటుకు సహకారం అందిస్తామని తెలిపారు.