ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
24-10-2026 09:49

జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు.
xPress24, Anakapalli, October 23,
అనకాపల్లి, అక్టోబర్ 23:
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 19న జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుందని వెల్లడించారు.
నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అటువంటి సమస్యల పరిష్కారానికి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, అభ్యర్థులకు తగిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే అనకాపల్లి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్
08924-222888
కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని సూచించారు. ఫిర్యాదులపై స్పందించేందుకు, అవసరమైన చర్యలు చేపట్టేందుకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.