తెలంగాణ
టీజీఎస్ఆర్టీసీ సరికొత్త అడుగు: 'ఐ-అలెర్ట్' టెక్నాలజీతో రూ. 36 కోట్ల డీజిల్ ఆదా!
23-11-2026 12:38

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టెక్నాలజీకి నాంది పలికింది. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, డీజిల్ పొదుపు పద్ధతులను ప్రోత్సహించడానికి బీఎస్-6 బస్సుల్లో 'ఐ-అలెర్ట్' వ్యవస్థను ప్రవేశపెట్టింది.
xPress24, Hyderabad, November 23,
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టెక్నాలజీకి నాంది పలికింది. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, డీజిల్ పొదుపు పద్ధతులను ప్రోత్సహించడానికి బీఎస్-6 బస్సుల్లో 'ఐ-అలెర్ట్' వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఆర్టీసీ నిలిచింది. ఈ వ్యవస్థ ద్వారా నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గడంతో పాటు బస్సుల మొత్తం ఇంధన సామర్థ్యం మెరుగుపడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నిర్వహణ సక్రమంగా ఉంటే ఆర్థికంగా ఆదా చేయొచ్చని ఆర్టీసీ నిరూపించింది. బస్సుల్లో సురక్షిత ప్రయాణం, డీజిల్ పొదుపు పద్ధతులను ప్రోత్సహించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. డ్రైవింగ్‌లో డీజిల్ పొదుపు పద్ధతులను అమలుచేస్తూ బీఎస్-6 బస్సుల్లో ఐ-అలెర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీని సమర్థంగా వినియోగించడం ద్వారా సంస్థ ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన హై స్పీడ్ డీజిల్ ఆయిల్‌ను ఆదా చేయగా, ప్రతినెలా సుమారు రూ.2 కోట్ల వరకూ ఆదా అవుతుందని సంస్థ వెల్లడించింది.ఆధునిక ఐ-అలెర్ట్ వ్యవస్థ బస్సుల్లో డ్రైవింగ్ విధానాలను నిరంతరం గమనిస్తూ డ్రైవర్ల పనితీరును అంచనా వేయడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా సరైన గేర్ ఎంపిక, నిర్దేశించిన గ్రీన్ బ్రాండ్ ఆర్పీఎం పరిధిలో డ్రైవింగ్ చేయడం, ఎకానమీ గేర్లను సమర్థవంతంగా వాడటం వంటి అంశాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఐ-అలెర్ట్ నివేదికల ఆధారంగా ఒక్కో డ్రైవర్ పనితీరు పరిశీలిస్తూ, క్రమం తప్పకుండా సమాచారం ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. విధి నిర్వహణ అనంతరం డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనా వేసి పనితీరుకు గ్రేడింగ్స్ కూడా ఇస్తుందని తెలిపారు. ఇంధన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన ప్రజారవాణా వ్యవస్థ పట్ల సంస్థ నిబద్ధతకు ఈ వ్యవస్థ నిదర్శనంగా నిలుస్తోందని ఆర్టీసీ ఎండీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ 1,500 అశోక్ లేలాండ్ బీఎస్-6 బస్సుల్లో ఐ-అలెర్ట్ పరికరాలను అమర్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా నెలకు 1,98,000 లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతోందని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఏడాదికి 6,169.84 మెట్రిక్ టన్నుల కర్బన వ్యర్థాలు సైతం తగ్గుతున్నాయని అధికారుల పరిశీనలో తేలింది.