జాతీయం
డిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీ
18-11-2026 15:52

తెలంగాణలో సినీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026' సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు, ఏవీజీసీ రంగ ప్రతినిధులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో జరిగే ఈ వేడుకలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ సహా 200కు పైగా సంస్థలు, లక్ష మందికి పైగా సందర్శకులు పాల్గొననుండగా, డిసెంబర్ 9న ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరీ నిర్వహించనున్నారు.
xPress24, Hyderabad, November 18,
తెలంగాణలో సినీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026' సదస్సును నిర్వహించనుంది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమ సన్నాహాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఆరెంజ్ ఎకానమీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు అపార అవకాశాలు ఉన్నాయని, ఏవీజీసీ పాలసీ, ఇమేజ్ టవర్స్ అభివృద్ధి ద్వారా సృజనాత్మక రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఇండియాజాయ్ విజయవంతానికి పరిశ్రమ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్ బాబు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, 'మా' ఉపాధ్యక్షుడు డాక్టర్ మాదాల రవి హామీ ఇచ్చారు. ఈ భేటీలో దర్శకులు హరీశ్ శంకర్, సాయి రాజేశ్, నటుడు రాహుల్ రవీంద్ర, ఏవీజీసీ రంగ ప్రతినిధులు సనత్, బాసిరెడ్డి సునీల్ పాల్గొన్నారు.
15 ఎకరాల్లో 200కు పైగా సంస్థల ప్రదర్శనలు
ఇండియాజాయ్-2026ను గతంతో పోలిస్తే పదిరెట్ల విస్తృతితో నిర్వహిస్తున్నామని ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వ్యూహాత్మక సలహాదారు అచల్ మల్హోత్రా పేర్కొన్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలో జరిగే ఈ వేడుకకు లక్ష మందికి పైగా సందర్శకులు, ప్రతినిధులు హాజరవుతారని అంచనా. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డీఎన్‌ఈజీ, ఈఏ స్పోర్ట్స్, యూబీసాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా 200కు పైగా సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నాయి. 100 మందికి పైగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఇందులో పాల్గొంటారు. వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాన్‌క్లేవ్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ సహా 15కు పైగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ కార్యక్రమం, 9న ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరీతో వేడుకలు జరగనున్నాయి.