ఆంధ్రప్రదేశ్
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ
27-10-2026 14:01

అర్నాబ్ తుపాను ప్రభావం నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 27,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 27:
అర్నాబ్ తుపాను ప్రభావం నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తుపాను ప్రభావంతో వాగులు, వంకలు, కాలువలు, నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ప్రజలు దాటకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ముంపు గ్రామాల్లో దండోరా ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్సులు, క్రేన్లు, ఇతర సహాయక సామగ్రిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలతో సమన్వయం చేసుకుంటూ, రెవెన్యూ, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో కలిసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావం తగ్గే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు సత్వర సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.