ఆంధ్రప్రదేశ్
తుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దు
27-10-2026 14:01
అర్నబ్ తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధుల్లో అక్టోబర్ 27, 28 తేదీల్లో 53కు పైగా రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ అదనపు డివిజనల్ మేనేజర్ ఎడ్విన్ తెలిపారు.
xPress24, Vijayawada, October 27,
విజయవాడ, అక్టోబర్ 27: అర్నబ్ తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధుల్లో అక్టోబర్ 27, 28 తేదీల్లో 53కు పైగా రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ అదనపు డివిజనల్ మేనేజర్ ఎడ్విన్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను (వార్ రూమ్‌లు) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బతినకుండా, పట్టాలపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు ప్రత్యేక సిబ్బందితో పాటు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థలపై నిరంతరం నిఘా ఉంచినట్లు ఎడ్విన్ తెలిపారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.